కామెడీ కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కామెడీ కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జులై 2020, సోమవారం

నేను...నా సబీరా!

అవి నేను డిగ్రీ చదువుతున్న రోజులు.అమెరికా ప్రెసిడెంట్ గా ఒబామా నెగ్గడం,జార్జిబుష్ ఓడిపోవడం ఆరోజుల్లోనే జరిగింది.నేను కూడా ప్రేమలో పడిపోవడం,ఓడిపోవడం ఆరోజుల్లోనే జరిగింది.అందుకే ఆ రోజులను నేను స్వర్ణయుగం,రాతియుగంగా నాకు నేనే నా డైరీలో రాసుకున్నాను.మీకు ఆశ్చర్యంగా వుందా?అయితే మీకు నాప్రేమ గాధ తెలియాల్సిందే...తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే!

ఫ్లాష్ బ్యాక్.....

        వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి ఉన్నాయి.మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారని భయపడి నా మోటారు సైకిల్ స్టార్ట్ కావడం మానేసింది. "నీకేం పర్లేదని సర్దిచెబుతూ ఎన్ని కిక్కులు కొట్టినా దానికి కిక్క్ ఎక్కలేదు.ఇక లాభం లేదనుకుని బైక్ ప్రక్కన పడేసి..వస్తోన్న ఆటోను ఆపి ఎక్కబోతుండగా ...అప్పుడే...అప్పుడే..ఓ మెరుపు మెరిసింది.
         కాకినాడ సముద్రం కెవ్వ్..కెవ్వ్..మని అరుస్తున్నట్లు ఒక్కటే సముద్రపు హోరులు
        మా రాజమండ్రి గోదారి గంగం డాన్స్ వేస్తున్నట్లు ఒక్కటే ప్రవాహం.
        ఓ అందమైన అమ్మాయి ఆటో దగ్గరికొచ్చింది.
        ఆ దేవుడు తను తయారు చేసిన వాటిల్లో కెల్లా స్త్రీ పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టి తయారుచేసినట్లు నాకు అప్పుడే అనిపించింది.
       వామ్మో..ఏమని వర్ణించను.
       తేజోవంతమైన ముఖం...
       గుండ్రాల్లాంటి కళ్లు...ముట్టుకుంటే కందిపోయేలా ఉండే తెల్లటి శరీర సౌష్టవం.
       నయాగరా జలపాతంలాంటి నడుము...అబ్బా!ఇంక చెప్పను..ఎందుకంటే ఆక్షణం నుందీ ఆ అమ్మాయి నాది!నా స్వంతం,నాకలలరాణి,నా హృదయాన్ని మీటిన యువరాణి.
     తలపై నుండి జాలువారుతున్న వర్షపు నీరు సరాసరి నోట్లోకి పోతున్నా పట్టించుకోకుండా..అలాగే నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాను.
      "ఎక్స్ క్యూజ్ మీ"
     నాకేం వినిపించడం లేదు.నా బాడీలోని అవయవాలన్నీ నామీద అసూయ,ఈర్ష్య వచ్చినట్టు ఎప్పుడో పనిచేయడం మానేసాయి.
     ఆహా...ఏమి అందం...ఏమి సొగసు...నేను తేరుకునేటప్పటికే ఆ అమ్మాయి ఆటో ఎక్కి చక్కా వెళ్లిపోతుంటే...ఓ బలమైన గాలి తిమ్మెర నా వీపుపై ఒక్కటిచ్చి వెళ్లిపోయింది.
     దెబ్బకు సృహలోకొచ్చాను.
     నా బైక్ దగ్గరికి పరుగెత్తికెళ్లి "నీకే పర్లేదే!...నీకు నా ప్రాణాన్ని అడ్డుపెడతాను.నా యువరాణి మిస్ అయితే నేను..నీకు మిగలను అని గట్టిగా అరుస్తుంటే...పాపం దానికి భయమేసిందో,జాలేసిందో తెలియదు గాని మొత్తానికి స్టార్ట్ అయ్యింది.
     ముందు ఆటో...వెనుక నేనూ...నా బైక్.
     ఆశ్చర్యం!..ప్రపంచ ఎనిమిదో వింత...ఆటో మాకాలనీ కొచ్చి మా ఇంటి ఎదురుగా ఉన్న ఫాతిమా ఆంటీ ఇంటి ముందు ఆగింది.
     ఆ అమ్మాయి ఆటోకి డబ్బులిచ్చేసి...గబ..గబా ఆ ఇంటిలోపలికి వెళ్లిపోయింది.
                                                     ***
     ఫాతిమా ఆంటీ నాకు బాగా పరిచయం..ఎప్పుడూ నన్ను తమ్ముడూ,తమ్ముడూ అని పిలుస్తుంది.బయటినుండి ఏ వస్తువు కావాలన్నా నాకే చెబుతుంది.సరదా గల మనిషి.అచ్చు ముస్లిం సంప్రదాయాలు పుణికి పుచ్చుకున్ని వుంటుంది.దైవభక్తి మెండు!నాకు ఫాతిమా ఆంటీ అంటే ఎంతో అభిమానం.ఆమెను మా కుటుంబం అంతా ఏంతో గౌరవిస్తుంది.ప్రతి సంతోషాన్ని ఆమెతో పాలు పంచుకుంటుంది.
    "ఫాతిమా ఆంటీ ఇంటికొచ్చిన అమ్మాయెవరే!"అమ్మను అడిగాను.
    "వాళ్ల అక్క కూతురు!ఇక్కడ ఓ పదిరోజులుడడానికి వచ్చిందట!ఆ అమ్మాయి తలిదండ్రులు క్యాప్ పని మీద బెంగుళూర్ వెళ్తే ఒంటరిగా ఉందని ఇక్కడకి తీసుకొచ్చింది ఆంటీ!"
    "పదిరోజులుంటుంది" ఇదే అండర్ లైన్ చేస్కున్నా!ఎలాగైనా ఆ అమ్మాయిని సాధించుకోవాలి.నా జీవిత భాగస్వామిని చేసుకోవాలి.ఆమె లేకపోతే నేను బ్రతకలేను.మనస్సులోనే గట్టి నిర్ణయం తీసేసుకున్నా..
     ఆరోజునుండి..నాకు సరైన నిద్ర,తిండి వుంటే ఓట్టు!ఒక్కటే కలలు,ఊహలు,ఆలోచనలు..నా హృదయమంతా ఆ అమ్మాయే ఆక్రమించింది.
                                                     ***
       ఒకరోజు ఆంటీ వచ్చి కరెంట్ బిల్లు కట్టి రమ్మని చెప్పింది
       నాకు ఓ మంచి అవకాశం రశీదు తీసుకుని సరాసరి ఆంటీ ఇంటికెళ్లవచ్చు.ఆ అమ్మాయిని చూడవచ్చు.మాట్లాడవచ్చు.అనుకున్నదే తడవు..ఫోన్ బిల్లు కట్టేసి ఆ రశీదు తీసుకుని డైరెక్ట్ గా ఫాతిమా ఆంటీ ఇంటికెళ్లాను.పెద్దగా రాని నేను...ఆరోజు వాళ్ల ఇంటికెళ్లినందుకు ఫాతిమా ఆంటీ చాలా సంతోషించింది.ఆనoదపడిపోయింది.
       ఇంటిలో ఉన్న ఏవేవో వంటకాలు ప్లేట్ నిండా పెట్టి ఇచ్చింది.
      "ఇవ్వన్నీ ఎందుకాంటీ" అంటుంటే "పర్లేదు తిను తమ్ముడూ"అంది.
       ఏంటో...తమ్ముడూ అన్న మాట "అల్లుడూ"అన్నట్టు వినిపించింది.
      అప్పుడే...అప్పుడే..నా హృదయరాణి మేమున్న హాల్లోకొచ్చింది.
      ఓ చల్లని తిమ్మెర..ఇళయరాజా పాటపాడుకుంటూ..నన్ను తాకి వెళ్లిపోయింది.
    "మన లక్ష్మి ఆంటీ గారి అబ్బాయి.చాలా మంచోడు!ఏ పని చెప్పినా చేస్తాడు.అస్సలు కాదనడు"నన్ను పరిచయం చేసింది ఆంటీ.
     ఆ అమ్మాయి అలాగా...జీతం లేని నౌకరన్నమాట అనే ఫీలింగిచ్చి "హాయ్" అంది.
    ఫాతిమా ఆంటీ నన్ను అలాగే పరిచయం చేసిందా?ఏమిటి? మనస్సులో గిల్టీగా అనిపించినా వెంటనే సరిదిద్దుకున్నా!
     నేను కూడా "హాయ్" చెప్పి "మీ పేరేమిటండీ "అని అడిగాను.
     ఆ అమ్మాయి చెప్పకుండానే ఫాతిమా ఆంటీ మధ్యలోకి దూరి "సబీరా"అంది.
     సబీరా" వావ్...బ్యూటిఫుల్ నేము!
    "సబీరా...ఓ సబీరా"అంటూ మనస్సులో ఓ పాటేసుకున్నాను.
     పాటయ్యెటప్పటికి అక్కడ సబీరా లేదు.తన గదిలోకి వెళ్లిపోయింది.
                         ***
      ఆరోజునుండి మొదలు.....
      సబీరాను చూడటం కోసం ఫాతిమా ఆంటీ ఇంటికెళ్లడం..ఆంటీ ఏకైక కొడుకైన బుడ్డోడ్ని మేపడం...ఇదీ నా దినచర్య.ఆ బుడ్డోడ్ని మేపాలంటే ఆర్ధిక బడ్జెట్ లో 50% కేటాయించినా సరిపోదు.ఇక నేనెక్కడా?నా పాకెట్ మనీ అంతా వాడికే సరిపోతుంది.
      ఒకరోజు సబీరా నాతో మాట్లాడింది.
     "చాక్లెట్లు అన్నీ వాడికేనా?నాకే లేవా?
      వామ్మో!సబీరా నన్ను చాక్లెట్ అడిగింది.ఈ బుడ్డోడ్ని అడ్డంగా మేపేది సబీరా కోసమే!అటువంటి సబీరాకు కొనకుండా ఉంటానా?
      ఆ రోజే ఓ పది పీచుమిఠాయిలు,అరడజను చాకోబారులు,ఓ డజను ఐస్ క్రీము పాకెట్లు కొని ఆంటీకి తెలియకుండా సబీరా రూం లో పెట్టేసాను.
      బుడ్డోడు ఏడ్వకుండా ఉండడానికి రూపాయికి పదొచ్చే చాక్లెట్ గోళీలు కొనేసి వాడికి పడేసాను.
      సబీరా ఆనందపడిపోయింది.
      ఆరోజునుండి...నేను వాళ్లింటికి..ఆమె మా ఇంటికి.
      పిచాపాటి కబుర్లు..తను ఇంటర్ సెకండియరని చెప్పింది.
      ఆమె మాటలు వింటుంటే...నా నరాలన్నీ వీణ తీగెల్లా తెగ మారుమ్రోగిపోయేవి.
     "నాకు చాకెట్లు అన్నా..చాకోబారులన్నా ఎంతో ఇష్టం!పిచ్చి!నీ వలన నాకోరిక తీరింది.మమ్మీ,డాడీ అయితే అసలు కొనరు,చిన్నపిల్లవా?చాక్లెట్లు తినడానికి అని కోప్పడేవారు"
     "ఇంకా కావాలా" అడిగాను
      "ఊ"
      ఆరోజు నాకు రెండువందలు వదిలాయి.
                  ***
      వర్షం కురుస్తున్న ఒకరోజు చూసుకుని సబీరాను కలుసుకున్నాను.కొద్ది సేపు అవీ,ఇవీ మాట్లాడి..నా షర్ట్ జేబులోనుండి లెటర్ తీసి ఆమెకిచ్చాను.
    "ఏమిటిది?"అడిగింది
    "లవ్ లె...ట....ర్"తడబడుతూ,విపరీతమైన టెన్షన్ తో చెప్పాను.
    "ఓ అలాగా!"అనేసి లెటర్ తీసుకుని వెళ్లిపోయింది.
     లెటర్ తీసుకుని పోయిందేమిటబ్బా?ఇష్టమున్నట్టా?లేనట్టా?..ఏం చెప్పలేదేమిటి?..నాకేమీ అర్ధం కాలేదు.కాసేపు జుట్టు పీక్కుని..ఇంకా ఎక్కువ పీక్కుంటే గుండవుతుందని భయపడి వదిలేసాను.
     ఆరోజు సాయంత్రం వరకూ నా రూం కిటికీలోనుండి ఫాతిమా ఆంటీ ఇంటి కేసే చూస్తూ ఉన్నా!సబీరా కనిపిస్తుందేమో అని!
     కొద్దిసేపటికి బుడ్డోడు వచ్చాడు.
     వాడి చేతిలో రెండు కాగితపు పడవబొమ్మలు ఉన్నాయి.
     ఎల్లో కలర్ పేపర్...అంటే నా లవ్ లెటర్ ఆ పడవ బొమ్మలు నా లవ్ లెటర్ తో చేసేసుకున్నాడా? గుండె జలదరించింది.
     వాడి వెనుకే సబీరా వచ్చింది.
     వాడు పడవలు...ప్రవహిస్తున్న వర్షపు నీటిలో వదిలి ఎగురుతుంటే సబీరా నాకేసి ఓ చూపు విసిరి..చిర్నవ్వు ఒకటొదిలి వెళ్లిపోయింది.
     నాకేమీ అర్ధంకాక మళ్లీ జుట్టు పీకున్నా!
            ***
ఆ మర్నాడు సబీరా వాళ్ల అమ్మా,నాన్నా రావడంతో నాకు సబీరాను కలవడానికి, మాట్లాడడానికి అస్సలు వీలు కుదరలేదు.సబీరా కూడా అస్సలు బయటికి కూడా రాలేదు.
            ***
     ఒకరోజు సాయంత్రం...
     నేను కాలేజీ నుండి వస్తుంటే..ఫాతిమా ఆటీ ఇంటి దగ్గర హడావుడి జరిగినట్లుగా అనిపించింది.
     అమ్మను అడిగాను."ఏం జరిగిందని?"
    "నీకు తెలియదా?..ఈరోజు మన సబీరాకి నిశ్చితార్ధం జరిగింది.వాళ్ల బావేనట!అబ్బాయి బాగానే వున్నాడు.ఇక నాకేం వినబడలేదు.కాళ్ల క్రింద భూమి కంపించినట్టయింది.ఎవరెస్ట్ శిఖరం ఎండిపోయినట్టు అనిపించింది.సబీరాకి నిశ్చితార్ధం జరిగిందా?..నా హృదయరాణికి నిశ్చితార్ధం జరిగిందా?..తట్టుకోలేక పోయాను.
     ఆరోజే సబీరాను ఎలాగైనా నిలదీయాలని..విక్రమార్కుడ్ని వదిలి పెట్టని దెయ్యంలా..విశ్వప్రయత్నాలు చేసి సబీరాను కలుసుకున్నాను.
    "ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను మోసం చేయడం నీకు ధర్మమా? గట్టిగా అడిగాను.
     "మోసం చేసానా?" ఆశ్చర్యంగా అడిగింది.
     ఆమె అలా ఆశ్చర్యపోతూ అడగడం నాకు ఆశ్చర్యమేసింది.
   "మనం ప్రేమించుకున్నాం కదా?"
    "మనం ప్రేమించుకున్నామా?నేను కూడా ప్రేమించానా?
     ఇదే ప్రశ్న...ఏం మాట్లాడుతోంది..నాకు తల తిరుగిపోతుంది
     "మొన్న లవ్ లెటర్ తీసుకున్నావ్ గదా?" అడిగాను.
    "ఓహో..అదా విషయం! లవ్ లెటర్ తీసుకున్నానని..నేను కూడా ప్రెమిస్తున్నానని అనుకుంటే ఎలా? ఆ రోజు సాయత్రమే నీ లవ్ లెటర్ని పడవలు చేసి మా బుడ్డోడి చేత వర్షపు నీటిలో వదిలిపెట్టడం నీవు చూడలేదా?"
     "చూసాను..అయితే"
     "ఇంకా అర్ధం కాలేదా?నీ లవ్ లెటర్ పడవలు చేసి నీటిలో వదిలివేసాను అంటే అర్ధం..నాపట్ల నీ ప్రేమ కూడా అలాగే వదిలేసుకోవాలని"
     ఇందులో ఇంత ఫిలాసఫీ వుందా?నాకు చాలా ఆశ్చర్యమేసింది!
     "మరి నేనంటే నీకసలు ప్రేమ లేనప్పుడు నా చాక్లెట్లు,చాకోబార్లు ఎందుకు తిన్నావ్? సూటిగా అడిగాను.
     "తియ్యగా ఉన్నాయని తిన్నాను..అంతే"
     "తియ్యగా ఉన్నాయని తినేసావా?"నోరెళ్లబట్టి చూస్తూ ఉండిపోయాను.
                ***
     ఆ రోజునుండి నేను నిద్రాహారాలు మానేసాను.జ్వరమొచ్చిందని అమ్మకి చెప్పేసి దుప్పటి ముసుగేసుకుని పడుకున్నా!సబీరా కూడా వాళ్ల ఊరెళ్లిపోయింది.పాపం నా బైక్ పెట్రోలు త్రాగడం మానేసి నామీద బెంగతో మూలన పడిపోయింది.