20, మార్చి 2020, శుక్రవారం

కరోనాపై భారత్ ప్రధాని మోదీ పోరు..22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ


కరోనాపై భారత్ ప్రధాని మోదీ పోరు..22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

indian-pm-Narendra-Modi-on-China-Virus-Corona
కరోనాపై భారత్ ప్రధాని మోదీ పోరు..22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ ప్రాణాంతక వైరస్ గానే పరిణమించింది. ఇప్పటికే లక్షలాది మందికి సోకిన ఈ వైరస్... వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. వేలాది మంది చనిపోయాక గానీ అంటమేల్కోని ప్రపంచం... ఇప్పుడు కరోనాను కట్టడి చేసేందుకు ఏకంగా యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగా మిగిలిన అన్ని దేశాల కంటే కూడా మెరుగైన చర్యలు తీసుకుంటున్న భారత్... ఇప్పుడు మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గురువారం జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ ప్రసంగంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్న మోదీ... కరోనాను నియంత్రించేందుకు స్వీయ జాగ్రత్తలే శరణ్యమని కూడా సెలవిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను నిర్వహించనున్నట్లుగా మోదీ సంచలన ప్రకటన చేశారు.

జనతా కర్ఫ్యూలో భాగంగా దేశ ప్రజలంతా ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల ద్వారా అసలు బయటకే రావద్దని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను నియంత్రించాలంటే ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటించిన మోదీ... స్వీయ నియంత్రణను మించిన మందు కరోనా నిరోధానికి లేదని సూచించారు. సదరు జాగ్రత్తలు జనానికి అలవాటు అయ్యే దిశగానే జనతా కర్ఫ్యూను మోదీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కరోనాను అరికట్టాలంటే... ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలను చేపట్టాలని - స్వీయ నియంత్రణే కరోనాకు అసలు సిసలు మందు అని దాదాపుగా అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఈ దిశగానే ఆలోచించిన మోదీ జనతా కర్ఫ్యూను ప్రకటించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.తన ప్రసంగంలో మోదీ ఇంకా ఏమన్నారన్న విషయానికి వస్తే... మానవజాతిని కరోనా వైరస్ సంక్షోభంలోకి నెట్టిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందని - మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తాయని మోదీ అన్నారు. కరోనాపై మనమంతా ఉమ్మడిగా పోరాడాలని - ఇందుకు దేశ ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాపై దేశ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని - భారత్ పై దీని ప్రభావం ఉండదనుకోవడం చాలా తప్పు అని మోదీ అన్నారు. కొన్ని వారాల్లో ఈ వైరస్ బారినపడే బాధితుల సంఖ్య పెరగబోతున్నదని - కరోనాకు మందులేదు కనుక సంకల్పం - అప్రమత్తతో వ్యవహరించాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టేనని - రానున్న వారాల్లో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని - సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే తమ పనులు చేసుకోవాలని - పెద్ద సంఖ్యలో ఒకే చోట గుమిగూడొద్దని - ఒకరి కొకరు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు మోదీ సూచించారు.

జనతా కర్ఫ్యూపై మోదీ తనదైన శైలి వివరణ ఇచ్చారు. ఈ నెల 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా కర్ఫ్యూ పాటిద్దామని - ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే చేసుకునే కర్ఫ్యూగా ఆయన అభివర్ణించారు. సాయంత్రం 5 గంటలకు ఇంటి గుమ్మాల్లో - కిటికీల వద్ద - బాల్కనీల్లో నిలబడి పౌరులు చప్పట్లు - గంటలు కొడుతూ సంఘీభావం తెలియజేద్దామని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఈ కర్ఫ్యూ తప్పదని - ప్రతిరోజూ పది మందికి ఫోన్ చేసి జనతా కర్ఫ్యూ గురించి చెప్పాలని - దీనిని యజ్ఞంలా నిర్వహించాలని సూచించారు. మనకు మనంగా విధించుకునే ఈ కర్ఫ్యూ కరోనాపై అతిపెద్ద యుద్ధంగా మోదీ అభివర్ణించారు. జనతా కర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని - ఈ కర్ఫ్యూ సందేశం - ఉద్దేశం ప్రజలందరికీ చేరవేయాలని మోదీ కోరారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.