26, మే 2019, ఆదివారం

ఎదుటి వారి గూర్చి తప్పుడు ప్రచారం చేసేవాడు మనిషే కాదు. చీడపురుగు కంటే హీనమైన వాడు.

*ఒక ముసలాయన పక్కింటి కుర్రాడు దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు.

రోజుకి ఒకరితో ఇలా చెబుతూ ఉండేసరికి ఈనోటా ఆనోటా విషయం పోలీస్ వరకూ వెళ్ళింది.

అనుమానం కొద్దీ అతడిని అరెస్ట్ చేశారు.

కేసు నడిచింది.

విచారణ అనంతరం ఈయనే ఆ పుకార్లకు కారణం అని తేలింది.

అతడిని వదిలి పెట్టేశారు.*

*ఆ యువకుడికి అవమానంగా తోచి ముసలాయన పై కేసు పెట్టాడు.

కేసు విచారణలో ముసలాయన ఊరికే నేను అన్నాను అంతే,దాని వలన అతడికి హాని ఏమీ జరగలేదు కదా అన్నాడు.*

*నీవు అతడి గురించి ఏమేమి అన్నావో అవి అన్నీ ఒక పేపర్ రాసి,ఆ పేపర్ చిన్న చిన్న ముక్కలు చేసి నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో విసిరెయ్యి.కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. రేపు తీర్పు చెబుతాను " అని జడ్జి అన్నారు.*

*జడ్జి చెప్పిన ప్రకారం చేశాడు ముసలాయన. మర్నాడు కోర్ట్ కి వెళ్ళాడు.*

*"నిన్న నువ్వు పారేసిన ముక్కలు అన్నీ తీసుకురా!" అన్నారు జడ్జి.*

*"అదెలా సాధ్యం? అవి గాలికి ఎక్కడెక్కడికో వెళ్లి పోయి ఉంటాయి.వాటిని తేవడం అసాధ్యం " అన్నాడు ముసలాయన.*

*"నువ్వు చేసిన చిన్న చిన్న కామెంట్స్ అతడి జీవితాన్ని ఎంతో మార్చేశాయి.
అది తిరిగి యధాస్థితికి రావడం అసాధ్యం.
నువ్వు ఒకరి గురించి మంచి మాట్లాడక పోతే పోయావు. చెడు ఎప్పడూ మాట్లాడకు."*

*మంచితనంపై నమ్మకం పోతుంది.*

*మనిషితనంపై నమ్మకం పోతుంది.*

*మనుషులపైనే నమ్మకం పోతుంది.*

*నిజంగా అవసరంలో ఉన్న వారికి,ఆపదలో ఉన్నవారికి,ఆసరా కావాలనుకున్నవారికి*
*సాయం చేయడానికి ఏ చేతులు ముందుకు రావు.

రేపు ఆ అవసరం నీకే రావచ్చు.         
*చరిత్రలో చెల్లని రూపాయిలే తరువాతి కాలంలో చరిత్రను లిఖించాయి.*

*పెద్దలు అనుభవంతో చెప్పిన మాటలు ఇవి*

22, మే 2019, బుధవారం

మన సక్సెస్ కు ప్రమాదం కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి! | We must avoid people who are at risk for our success!

నిన్న ఒక ఆధ్యాత్మిక సెలబ్రిటీని కలిసాను.ఎందుకో తెలీదు గాని ఆయనతో మాటలాడినప్పుడల్లా నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.లైఫ్ లో ఏదో సాధించాలన్న కసి పుడుతుంది.అంతగా ఆయన మాటలు నాకు ప్రేరణ కలిగిస్తాయి.మనకంటే గొప్పవారితోనే మన సంబంధాలు పెట్టుకోవాలి.లేదా మన రంగానికి సంబధించినవారితో నన్న కలిసి ఉంటే ప్రయోజనం ఉంటుంది.ఎదుటివారి గురించి చాడీలు చెప్పేవారి దగ్గర,ఎగతాళిగా మాటలాడేవారి దగ్గర అస్సలు కూర్చోకూడదు.మన సమయం వృధాతో పాటు,మానసికంగా అప్సెట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

   కొంతమంది మేధావులుంటారు.వీళ్లు తమ విషయాలేమీ తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ...ఎదుటి వారి అన్ని విషయాలు కూపీలాగి మరీ తెలుసుకుంటారు.ఏదైనా ఇష్టంలేని పరిస్థితి వస్తే ఆ విషయాలన్నీ బైట పెడుతూ ఎంతో నష్టానికి గురి చేస్తారు.వీళ్లు మహా ప్రమాదకరమైన వ్యక్తులు.వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

   ఏది,ఏమైనా మన సక్సెస్ పై ప్రభావం మన కలిగియున్న వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. జాగ్రత్త వహిస్తే మనకే మంచిది.ఏమంటారు?

10, మే 2019, శుక్రవారం

ఆసక్తి [Interest] కలగాలంటే?

     మనం చేసే పనిమీద ఏకాగ్రత కుదరడానికి మనం చేసే పనిమీద మనకి ఆసక్తి ఉండాలన్నది నిర్వివాదాంశం.ఆసక్తి అంటే వినే విషయం మీద శ్రద్ధ,ఆ విషయాన్ని గురించి ఒక అనుభూతిని పొంది, ఆకళింపును చేసుకోగలగడం.పూర్వపుస్మృతికి ప్రస్తుత అనుభూతికి ఉన్న అపూర్వ సంబంధమే ఆసక్తి.అనేక యితర విషయాల్లోంచి మనకు ఆసక్తికరమైన విషయాన్ని మాత్రమే ఎన్నుకుని మనస్సులో పదిలపరచుకుందామనే విషయంపై తప్పక ఆసక్తిని పెంచుకోవాలి.ఆసక్తి ఉన్న విషయాలు అప్రయత్నంగానే గుర్తుంటాయి.

     అయితే మనకి ఆసక్తిలేని విషయాలపైన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి,శ్రద్ధ పెంచుకోక తప్పదు.అవసరం వల్ల ఆసక్తి దానంతట అదే కలుగుతుంది.జీవితానికి అవసరమైనదానిని గుర్తుంచు తీరాలని నిర్ణయించుకోవాలి.అప్పుడు ప్రతి చిన్న విషయం తప్పనిసరిగా గుర్తుంటుంది.ఆసక్తిలేని విషయాలను అధ్యయనం చేయవలసిన సందర్భాలలో తమకు తాము 'ఆటోసజెషన్" ఇచ్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

     ఏకాగ్రత,జ్ఞాపకశక్తి కేవలం ఆసక్తి మీదే ఆధారపడి ఉండవు.కేవలం ఆసక్తి ఒక్కటే ఏకాగ్రతకు,జ్ఞాపకశక్తికి కారణం కాదు.చేసే పని నచ్చకపోవడానికి కారణం నచ్చదనే దృఢాభిప్రాయంతో కూడిన భావనే.ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటే ఆ పని నచ్చుతుంది.చేసే పని మీద న్యూన్యతాభావం కూడా ఆసక్తి లేకపోవడానికి మరో కారణం.ఆసక్తిని కలిగించుకుని,పెంపొందించుకుంటే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
7, మే 2019, మంగళవారం

ఎదుటివారి విషయాలకి అడ్డుకట్ట వేయండి.

మనం చాలా వరకు ఇతరుల గురించి ఆలోచించినంతగా మన గురించి మనం ఆలోచించుకోము. అందుకేనేమో మనకీ సమస్యలు...కష్టాలునూ! తెల్లవారి లేచిన తరువాత మన పనులేమిటి? నిన్నటి కంటే ఈరోజు సాధించిన విజయమేమిటి? ఈరోజు ఇంకా చక్కగా అభివృద్ధికి తీసుకెళ్లామా? లేదా? ఇత్యాది ప్రశ్నలు ప్రతిరోజూ వేసుకుంటూ దానికి సంబంధించిన ప్రణాళిక మనం సరి చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈరోజుల్లొ మనం ప్రశాంతంగా బ్రతకాలంటే మన పనులను మనం చేసుకోవాలి. ఇతరుల విషయాలలోకి తల దూర్చి బొప్పి కట్టించుకోవడం తప్ప మరేమీ లేదు. రోజులు ఎలా తయారయ్యాయి అంటే ఇతరుల మేలు కోసం కృషి చేసినప్పుడు లాభం చేకూరితే నిన్ను మెచ్చుకోవడం అరుదుగా చేసి తన గొప్పదనం ప్రకటించుకుంటాడు. ఒకవేళ నష్టం కలిగితే అతిదారుణంగా నీ పట్ల అవహేళన భావంతో నిరసిస్తూ నిందిస్తాడు. ఎక్కడో కొంతమంది మహానుభావులు నష్టాన్ని, లాభాన్ని ఒకలా తీసుకుంటారు. అలాంటివారు ఈలోకంలో బహు అరుదు అని చెప్పవచ్చు. ఇకపోతే ముందు చెప్పుకున్నట్టుగా మన పని మనం చేసుకోవడం మాని ఈ తలపోటు ఎందుకు చెప్పండి. ఈరోజుల్లొ మనుష్యుల కోపతాపాలకు, పగలకు అంతులేదు. కంట్రోల్ కూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో ఎదుటివారి గురించి ఆలోచించడం అనవసరం. మనకి ఏమైనా కలిగినప్పుడు సహకరించడం తప్ప వారి వ్యవహారాలలో దూరకపోవడం వందరెట్లు మేలని నా అభిప్రాయం.