9, మార్చి 2019, శనివారం

మహిళల గూర్చి కొంతైనా తెలుసుకో...కాస్తైనా మార్చుకో ? | Learn something about women ... can you change anything?

ఏ శాస్త్రమూ చెప్పలేదు...!!
ఎంగిలిపడిన బండెడు అంట్లనూ ఇంటి "మహిళ"లే కడగాలనీ...!!

ఏ చట్టమూ చెప్పలేదు ప్రతిరోజూ ఉరుకుపరుగుతో వంటను "వనిత"లే చేయాలనీ...!!

ఏ గ్రంథమూ చెప్పలేదు నిత్యం గదులన్నిటినీ "నీరజాక్షే" ఊడ్చి నీరాజనాలు అందుకోవాలనీ...!!

ఏ భారత భాగవతాలూ చెప్పలేదు...
ఇంటి సంతానపు ఆలనాపాలనా ఇంటి "భామే" చూసుకోవాలనీ...!!

ఏ లలిత సంగీత కళల రాగాలూ చెప్పలేదు "లలన" లిప్తపాటు కనులతో మౌనవించాలనీ...!!

భవితలో ఎక్కడా రాసి పొందుపరచలేదు ఇంటి "భామ"లే బండెడు బట్టలు ఉతికి ఆరేయాలనీ...!!

ఏ కమనీయ భాషలూ చెప్పలేదు తన కడుపు మాడ్చుకునీ అందరి కడుపులూ "కోమలే" నింపాలనీ...!!

ఏ వరమిచ్చే దేవుడు కూడా చెప్పలేదు "వనితంటే" వంటింటి కుందేలుగా పరిమితమైపోవాలనీ...!!మనలాంటి మనుషులే వారు కూడా...!!

మనం అంట్లు కడిగితే ఆడంబరాలేవీ తరిగిపోవు...!!

మనం వంట చేస్తే ఒంట్లో కండలేవీ కరిగిపోవు...!!

ఇంట్లో గదులన్నీ ఊడిస్తే చుట్టుపక్కల వారి ముందు చిన్నవాడవైపోవు...!!

పిల్లలకి స్నానం చేయించి తయారుచేస్తే తలంతా ఊడిపోయి బట్టబుర్రలైపోవు...!!

ప్రతినిత్యం మనం మగువని ఇంట్లో నవ్విస్తే మన నోట్లో నవరత్నాలేవీ రాలిపోవు...!!

మనం మన ఇంట్లో బట్టలు ఉతుక్కుంటే మన అందాలేవీ కరిగిపోవు...!!

మనం తినే ముందు ఒక ముద్ద కలిపి ఆమె నోటిలో పెడితే మన కడుపులేమీ ఎండిపోవు...!!

నువ్వూ ఒక అమ్మ కి కొడుకువే...!!
ఒక భార్యకి భర్తవే...!!

నీకు ఆమె ఇచ్చే హోదా నువ్వు కూడా ఇస్తే నీ ఆస్తులేవీ తరిగిపోవు...!!

పాత చింతకాయ పచ్చడి పద్దతులు పక్కనపెట్టు కాసేపు...!!

నీలాగే నీకంటే వాళ్ళకి ఎక్కువ ఆత్మాభిమానం ఉందని గుర్తుంచుకో...!!

ఒక మెట్టు దిగి ఆమెకు నీ మనసులో పరిపూర్ణమైన స్థానాన్ని ఇచ్చి చూడు...!!

చిన్న చిన్న పనులలో సాయం చేసి నీకిచ్చే విలువను నువ్వు మరింత పెంచుకో...!!

మనపై కోపాన్ని గిన్నెల మీదా గరిటెల మీదా వండే వంట మీద చూపెడుతోందని గ్రహించుకో....!!

వంటిల్లంటే ఆమెదే కాదనీ ఆమెకన్నా ఎక్కువ మనదేననీ తెలుసుకో...!!

అప్పుడే కారాలు ఎక్కువగా ఉండవు...!!
మాడిపోయిన కూరలు అసలే ఉండవు....!!
ఉప్పు ఊరిపోదూ...!!
పప్పు కారిపోదూ...!!
కమ్మని పెరుగు భోజనంలా కడుపునిండా కలకాలం కలిసి భోజనం చేయవచ్చు....!!

1 వ్యాఖ్య:

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.