23, మార్చి 2019, శనివారం

వారానికి ఒకరోజైనా మనతో మనం బ్రతుకుదాం!

మనిషికి ఒంటరితనం ఎన్నో అక్కర్లేని విషయాలు నేర్పుతుంది.ఎక్కువుగా ఖాళీగా ఉంటే మనిషికి అన్నీ నెగిటివ్ ఆలోచనలు ముసురుకుంటాయి.అందుకే కాబోలు పెద్దలు ఖాళీ బుర్ర దెయ్యాల నివాసం అవుతుందని చెప్పారు.మనిషి ఏదో వ్యాపకం పెట్టుకోవాలి.అది మనకి మంచి చేసేదై ఉండి, మన అభివృద్ధికి దోహదం చేసేదై ఉంటే ఎంతో మేలు.

నిజానికి మన సంతోషానికి,దు:ఖానికి మనమే కారణం.దీనికి వేరెవ్వరూ కారణం కాదు.మనం కాస్త ప్రశాంతంగా ఉండాలంటే తెల్లవారు లేచి దైవప్రార్ధన చేసుకుని మన పనులు చక్కబెట్టుకోవడంలో ఉన్న ఆనందం,సంతోషం మరెందులోనూ ఉండదు.

రాత్రుళ్లు 1నుండి,2గంటల టైం వరకూ పడుకోకుండా,మర్నాడు సూర్యుడు నడినెత్తికి వస్తున్న సమయంలో నిద్రలేవడాలు,లేక ఉదయం 8,9గంటలకు మేల్కోడాలు ఇవ్వన్నీ కూడా మనిషికి ప్రశాంతతను దూరం చేసేవే.అనారోగ్యాన్ని దగ్గర చేసేవే.


తెల్లవారుజాము లేచి ఒకగ్లాసు నీళ్లు త్రాగి,దైవప్రార్ధన చేసుకునేవాడికి జీవితంలో పెద్ద అశాంతికరమైన రోజులు ఉండవు.ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా దానిని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పొంది ఉంటాడు కాబట్టి అతనికి సమస్య యొక్క తీవ్రత ఏమీ కనిపించదు.నిజానికి సమస్యలు అన్నీ చిన్నవే.మనం పరిష్కరించుకోలేనంత సమస్యలు ఉండవు.మనమే ఆందోళనతో పెద్ద సమస్యలగా చిత్రీకరించుకుంటాము.

ఈరోజు మనిషి తనలో తను బ్రతకడం ఎప్పుడో మానేసాడు.అందుకే ఈ అసంతృప్తి బ్రతుకులు.ఈ చిన్న జీవితానికి ఎందుకో ఈ ఆరాటాలు!ఈ బిజీ లైఫ్ లోనుండి వారానికి ఒక్కసారైనా బయటపడి ఫ్రీగా బ్రతకాలి.

పచ్చని ప్రాంతాలు చూడటం,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడం, అనాదశరణాలయాలలో కొద్దిసేపు గడపడం చేయాలి,చక్కని సాహిత్య పుస్తకాలో లేక ఆధ్యాత్మిక పుస్తకాలో తప్పకుండా చదవాలి.మనిషి ఆనందం పొందటానికి ఎన్నో పనులున్నాయి.అవన్నీ చేయవచ్చు.అంతే కాని త్రాగుడులోనూ,జూదంలోనూ కూడా ఆనందం ఉంది అనుకునేవాడిని మాత్రం ఎవరూ బాగు చేయలేరు.


అసంతృప్తి జీవితం... త్రాగుడుకు బానిసను చేస్తుంది.ఆ బానిస బ్రతుకు చివరికి ప్రశాంతతను దూరం చేస్తుంది.త్రాగుడు అలవాటైన వాళ్లు ఆ త్రాగుడును సమర్ధించుకున్నా వాళ్ల అంతరాత్మలకు వాళ్ల స్థితి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది.పైకే గంభీరం.లోపలంతా లోలాటమే.

మన అలవాట్లు,అభిరుచులు మన రంగానికి అనుకూలమైతే వాళ్ల జీవిత ఉన్నతకు ఏవిధమైన అడ్డంకి ఉండదు.ఉండబోదు.శుభం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.