19, జనవరి 2017, గురువారం

TTDP లీడర్ రేవంత్ రెడ్డి చెప్పిన పులి-గాడిద కథ!

ఉదాహరణగా రేవంత్ రెడ్డి చెప్పిన కథ ఇది. "ఒక అడవిలో ఒక పులి - ఒక గాడిద హోరాహోరిగా పోరాడుతున్నాయి వాటి అరుపులు కేకలతో అడవి మొత్తం దద్దరిల్లిపోతోంది. రాత్రి వెళ కూడ వాటి పోరాటం ఆగలేదు. ఇది అడవిలోని ఇతర జంతువులకు ఇబ్బందిగా తయారుకావడంతో ఒక ఏనుగు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. ఇంతకు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారని పులి - గాడిదలను ఆ ఏనుగు అడిగింది. 'భూమికి దూరంగా కనిపించే భూమి ఆకాశాలు రెండు నిజంగా కలిసే ఉన్నాయని నేను చెప్తున్నాను కానీ అవి కల్పినట్లు కనిపిస్తాయే తప్ప నిజంగా కలవవని ఈ పులి చెప్తోంది' అని గాడిద బదులిచ్చింది" అంటూ రేవంత్ తదనంతర కథ వివరించారు.

"ఇలా కాదని  ఏనుగు ఏ వివాదం అయినా మన అడవి రాజ సింహం దగ్గరే తేల్చుకోవాలని పులి - గాడిదలను సింహం వద్దకు తీసుకువెళ్లింది. వాటిని విచారించిన సింహం పులిని కట్టెసి వంద కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించింది. దీంతో బిత్తరపోయిన పులి 'మహారాజా నేను చెప్తున్నది నిజమే అని మీకు తెలుసుకదా? మరి నన్నెందుకు కొట్టమన్నారు?' అని సింహాన్ని అడిగింది. 'అది గాడిద - దానికి నువ్వేం చెప్పినా అర్థం కాదు - అది అనుకున్నదే చెప్తుంది ఆ విషయం తెలిసికూడా  నువ్వు గాడదతో గొడవ పడ్డావు. అందుకే నీకు ఈ కొరడా దెబ్బలు' అని సింహం స్పష్టం చేసింది. ఈ కథలో నీతిలాగానే సభలో మీరు ఏం చెప్పినా ఎవరు వినరని ఓ పెద్దమనిషి నాకు చెప్పారు!" అంటూ ముక్తాయించారు రేవంత్. ఈ కథ ద్వారా అధికార పక్షాన్ని ఏం తిట్టాలో అది పరోక్షంగా తిట్టారని టీడీపీ నాయకులు అంటున్నారు. 

13, జనవరి 2017, శుక్రవారం

గౌరవించాల్సిన సంస్కృతి పండుగ : "సంక్రాంతి"

అన్ని మతాలవాళ్ళు, అన్ని కులాల వారు కల్సి జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ వచ్చిందంటేనే చాలు అందరిలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒకప్పుడు సంక్రాతి వస్తే పది,పదిహేను రోజుల ముందు నుండే ఇల్లంతా శుభ్రం చేసుకుని, రుచి కరమైన పిండి వంటలు వండుకునేవారు. ఆ వంటకాలు ఐదు నుండి పది రకాల వంటకాలవరకూ చేసుకునేవారు. కాని ఇప్పుడు కాస్త ఎక్కువుగానే సంక్రాంతి హడావిడి తగ్గిపోయింది. కారణాలు అనేకం కావచ్చు. నిజానికి సంక్రాంతిలో ఉన్న గొప్పతనం ఎందులోనూ లేదు. ఇది నాలుగు రోజుల పండుగ. మొదటి రోజు భోగితో ప్రారంభమయ్యి చివరి రోజు ముక్కనుమ తో ముగుస్తుంది. భోగిరోజు పచ్చిపులుసు, అత్తెసరు, పెద్ద పండుగ నాడు పప్పు గారెలు,పకోడీలు, కనుమ నాడు నాటు కోడి మాంసం ముక్కనుమ రోజు ఏది బడితే అది. ఇదీ సంక్రాంతి షెడ్యూలు. ఇలాగే ఉండాలని లేదు. అయితే అత్యధికులు మాత్రo ఈవిధంగానే చేసుకుంటారు.
          ఏది,ఏమైనా సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు, తమ స్తోమతను బట్టి కొత్త బట్టలతో హడావుడి చేస్తూ గడుపుతారు. ఇది అందరూ జరుపుకోవాల్సిన పండుగ. అందరూ కాపాడుకోవాల్సిన సంస్కృతి.