31, జులై 2015, శుక్రవారం

అతి త్వరలో "సాక్ష్యం సంచలన పత్రిక " ప్రింటెడ్ మాసపత్రికగా మీ ముందుకు!

సాక్ష్యం సంచలన పత్రిక స్థాపించాలని ఎప్పటినుండో నా కల. ఎట్టకేలకు అన్నీ పరిమిషన్స్ తీసుకుని త్వరలో రెడీ అవ్వబోతుంది. ఈ మాస పత్రిక నడపాలంటే చాలా బరువైన వ్యవహారం కాబట్టి ఇప్పటి వరకూ సరైన జోడు లభించక ఆగిపోవడం జరిగింది. అయితే దేవుడు దయవలన మంచి మిత్రుడు, ప్రముఖ ధార్మిక రచయిత అయిన యం.డి.యన్.ప్రకాష్ గారి సహకారం లభించడం, ఆయన భాగస్వామి కావడం సంతోషదాయకమైన విషయంగా పరిగణిస్తున్నాను. పత్రికాఫీసుకు సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరిగిపోతున్నాయి.దేవుడనుగ్రహిస్తే తొలి పత్రిక త్వరలోనే మీముందుకు వస్తుంది. అంతవరకూ సెలవు. శుభం.

28, జులై 2015, మంగళవారం

"కాకినాడ బజార్" నూతన బ్లాగ్ ప్రారంభం!

ఎప్పటినుండో కాకినాడకు సంబంధించిన విశేషాలతో ఒక బ్లాగును ప్రారంభించాలని అనుకుంటూ ఉండేవాడిని. దైవానుగ్రహం అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఇకనుండీ కాకినాడకు గూర్చిన సమాచారమంతా ఈ బ్లాగు ద్వారా అందుతూనే ఉంటుంది. కాకినాడ వాసులకు ఉపయోగకరంగానూ, మిగతా ప్రాంతాలవారికి సమాచారాత్మకంగానూ ఈబ్లాగును తయారుజేస్తాను. ఒకసారి ఈ లింక్ ద్వారా Kakinada bazaar వీక్షించి మీ విలువైన సలహాలు,సూచనలు అందించగలరని ఆశిస్తున్నాను.

25, జులై 2015, శనివారం

మంచి ముత్యాలు

  • దైవం ఏదో ఇవ్వాలని ఆరాధించడం కాదు. ఎన్నో ఇచ్చాడని గుర్తించి ఆరాధించడమే దైవారాధన.
  • తీర్చుకోవాల్సిన వాటిలో ప్రధమ ఋణం -దేవరుణం.
  • శరీరం మనల్ని వదిలితే మృత్యువు. మనం శరీరాన్ని వదిలితే మోక్షం.
  • దేవుడు ఇంకా ఆయుస్శును ఉంచాడూ అంటే, ఇంకా అవకాశం ఇచ్చాడని అర్ధం.
  • శరీరానికి పెద్దరికం వస్తే ఫరవాలేదు. మనసుకు మాత్రం ముసలితనాన్ని రానీయరాదు.

18, జులై 2015, శనివారం

"బాహుబలి" సినిమాకెళ్ళి బుక్కయ్యాను!

సినిమా పూర్తి అయ్యేవరకూ "బాహుబలి" సినిమా రెండు భాగాలు అన్న విషయం నాకు తెలియదు. టి.వి.సీరియల్ మాదిరి ఎండింగ్ లో సస్పెన్స్ లో పెట్టేసి బయటికి పంపేసిండు. తండ్రి బాహుబలికి ఏమి జరిగిందో అర్ధం కాక, ఆయనను అతని నమ్మిన అనుచరుడే వెనుక నుండి వెన్నుపోటు పొడిచి ఎందుకు చంపాడో తెలియక బుర్ర పిచ్చెక్కిపోయింది. కొడుకు బాహుబలి ఏమి చేస్తాడో ఇక చూడాలి. ఇవన్నీ తెలియాలంటే మరో 110 రూపాయలు పట్టుకుని రెండో భాగం కోసం ఎదురు చూడాలి.
       కట్ చేసి...సినిమా విషయానికొస్తే ...
       ఏమాటకామాటే చెప్పుకోవాలి. సినిమా ఇంచుమించు హాలీవుడ్ తరహాలో ఉందంటే నమ్మండి. సినిమా క్లైమాక్స్ యుద్ధం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా ప్రారంభంలో వాటర్ ఫాల్ ఒక అద్భుతమైన వింతలా తీశారు. అది గ్రాఫిక్స్ మీదే సృష్టించారని, అది నిజంకాదని పేపర్లో చదివి చాలా ఆశ్చర్యపోయాను. సినిమాలో ప్రకృతి అందాలను చాలా చక్కగా చూపించారు.
      సినిమా కధ విషయానికొస్తే చాలా బలహీనంగానే అనిపించింది. పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ నాకైతే మొదటి భాగంలో అనిపించలేదు. ఇక రెండో భాగంలో ఉంటుందేమో చూడాలి.

16, జులై 2015, గురువారం

తెలుగు బ్లాగుల ఆస్వాదమ్

రాత్రి ఎందుకో సరిగా నిద్ర రాలేదు. ఏమి చేద్దామా అని ఆలోచిస్తుండగా నా దృష్టి నా బ్లాగ్ వేదిక పై పడింది.సర్లే ఒకసారి బ్లాగులన్నీ చదువుదామని కూర్చొని ఇంచుమించు పాతవి ,కొత్తవి చాలా బ్లాగులను పరిశీలించి చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను. అందులో కొండలరావుగారి ప్రజాబ్లాగులోని నీహారికగారి ఇంటర్వూ నాకు బాగా నచ్చింది.ఆమె నిక్కచ్చిగానే ఇచ్చిన సమాధానాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.ఇకపోతే కొన్ని బ్లాగుల ద్వారా ఒక గొప్ప విషయం తెలిసింది.అదేమిటంటే బ్లాగు పెట్టి ఏదో రాయడం కాదు ఆ వ్రాసేదేదో మనిషికి చదవాలనే జిజ్ఞాస, జ్ఞానం, చైతన్యం వంటివి కలిగే విషయాలే వ్రాయాలి.ఒక రకంగా చెప్పాలంటే బ్లాగర్లలో సెలబ్రిటీ అయ్యిపోవాలి. ఈ ఆలోచనలు చాలా గొప్పవి కాబట్టే నాకు బాగా నచ్చాయి.
      కొన్ని కామెంట్లు చదివినప్పుడు కొంతమంది నేను తల్చుకుంటే ఎవరినైనా సరే తోక ముడుచుకునేలా చేస్తానని, పరుగులు తీయిస్తాననే తరహాలోనే  పెట్టారు. ఇది వారి అహంకారానికి నిదర్శనం తప్ప మరేమీ కాదు.
      ఏమైనా ఏవో కొన్ని బ్లాగుల్లో ఒకటి రెండు మంచి టపాలు తప్ప గొప్పగా అనిపించే బ్లాగేమి కనిపించలేదు. గూగులమ్మను అడిగినా చూపించలేదు. ఇకనుండైనా మంచి,మంచి బ్లాగులు రావాలని కోరుకుందాం!

14, జులై 2015, మంగళవారం

"బాహుబలి" విజయవంతమయ్యిందా?

రాజమౌళిగారు దర్శకత్వంలో వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా బాహుబలి గురించి పేక్షకులలో వివిధ కామెంట్లు వస్తున్నాయి. అత్యధికంగా సినిమా పెద్దేమీ సూపర్ హిట్ కాదన్న విమర్శలే కాన వస్తున్నాయి. అయితే సినిమాకి కావల్సిన కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయని రిపోర్టులు చెపుతున్నాయి. ఏది,ఏమైనా తెలుగు సినిమాని హాలీవుడ్ తరహాలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళిగారిని అభినందించవల్సిందే!