29, ఆగస్టు 2014, శుక్రవారం

సబీరా నాకు ఫోన్ చేసింది!

గతంలో నేను రాసిన కధ సబీరా చదివిందట!నాకు ఎప్పుడైనా నీవు పీచు మిఠాయిలు,చాకోబార్లు కొన్నావా? అని అడిగింది.(కధలో అలా స్టోరీ కల్పించాను తప్ప నిజానికి ఎప్పుడూ కొనలేదు).ఏది,ఏమైనా నేను రాసిన కధ చదివి నాతో సబీరా ఫోన్ చేసి మాటలాడటం ఆనందమేసింది.ఇప్పుడు ఆమెకు పెళ్లి అయ్యిపోయింది.మా మధ్య చక్కని ఫ్రెండ్ షిఫ్ ఉంది.ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకుంటుంది.మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను చూడకుండా వెళ్లదు.మంచి అమ్మాయి.ఆమె నా లైఫ్ లో లేకపోవడం నా దురదృష్టం.ఆమె లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండడమే నాకు కావాలి.సబీరా చాలా అందమైన, మంచి మనసున్న అమ్మాయి.ఆమె గుర్తుకొచ్చినందుకు మనస్సంతా బరువెక్కింది.

       

23, ఆగస్టు 2014, శనివారం

నేను ప్రేమలో పడ్డానా?

సహజంగానే ప్రేమలకు వ్యతిరేకినైన నేను నిన్న ఆ అమ్మాయిని ఎందుకు అలా చూస్తూ ఉండిపోయాను? నన్ను తనవైపునకు తిప్పుకునే శక్తి ఆమెకెలా వచ్చింది? నా హృదయంలో ఎక్కడో అలజడి...ఆమెను చూడకుండా ఉండలేని పరిస్తితి.ఇంతకీ నాది ఆకర్షణ ఏమో? మనసంతా అలజడి...ఏదో అనిర్వచనీయమైన ఫీలింగ్.ఇదంతా జరుగుతుంది నాకేనా? ఇంతకీ నాకేమయింది? ఎందుకు ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాను.ఏమీ అర్ధం కావడం లేదు.
 ఫంక్షన్ లో ఆ అమ్మాయిని అదే ఫస్ట్ టైం చూడటం.స్కై బ్లూ కలర్ డ్రెస్ లో ఎలా ఉన్నదంటే స్వర్గం నుండి దిగి వచ్చిన దేవతలా కనిపించింది.ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూసానో,లేదో ఓ చల్లని గాలి తిమ్మెర నా హృదయాన్ని తాకి వెళ్లి పోయింది.నేను ఈ లోకాన్నే మర్చిపోయాను.
 నాకు ఏమి అర్ధం కావడం లేదు.అసలు ఏమీ తినాలనిపించడం లేదు.గంట తరువాత ఆ అమ్మాయి వాళ్ల పేరెంట్స్ తో కారెక్కి వెళ్లిపోయింది.ఇక నాకు కనిపించదా? ఆ అమ్మాయిని ఎలా వెదకడం? ఎక్కడుంటుంది?
 ఏదో కోల్పోయినట్టు మనసంతా ఒకరకమైన ఫీలింగ్!
 ఏది,ఏమైనా యుక్త వయస్సు వచ్చిన వెంటనే తోడు లేకపోతే ప్రమాదమే!
 నా జీవితానికి ఆ అమ్మాయి దొరుకుతుందా? ప్రేమంటే...వ్యతిరేకినైన నన్ను ఇలా కదిలించి వెళ్లి పోయిందేమిటి? నా మనసులో ఎందుకు అలజడి సృష్టించి వెళ్లిపోయింది?
 "చౌదరి బాబు భోజనం చేయండి" ఆ ఫంక్షన్ తాలూకు పెద్దాయన పిలుస్తున్నా...పట్టించుకోకుండా అక్కడి నుండి వచ్చేసాను.ఏం చేస్తున్నానో నాకే అర్ధం కావడం లేదు.ఎంతమంది ముస్లిం సోదరులు సలాం చెప్పినా చెయ్యి ఊపి రావడమే గాని పరిసరాలను గుర్తించే స్తితిలో నేను లేను.ఇంతకీ నాకేమైంది? నేను ప్రేమలో పడ్డానా?

నీ జతగా నేనుండాలి.

"నీ జతగా నేనుండాలి" సినిమా చూసాను.ఎందుకో తెలీదు గాని నా మనసంతా పిండేసినట్టు అయ్యింది.చాలా,చాలా బాగుంది.ఒక మధ్య తరగతి అమ్మాయి సింగింగ్ టాలెంట్ గుర్తించిన ఓ సుపర్ స్టార్ సింగర్ (హీరో)ఆమెను ఉన్నతమైన స్తితికి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తాడు.అతను తాగుడుకు బానిసై తన ఇమేజ్ ను కోల్పోతాడు.తన స్తితి ఆమెకు అడ్దు రాకూడదని దూరం వెళ్ళి పోవాలనుకుంటాడు.ఆమె ఒప్పుకోదు.ఇవ్వన్నీ నీవల్లే వచ్చాయి.నీవే లేనిది ఇవ్వన్నీ నాకెందుకు? అని ఆమె అంటుంది.కొన్నాళ్లు కలిసి జీవించిన తరువాత తన ప్రవర్తన ఆమె భరించడం అతనికి ఇష్టం ఉండదు.తన ఇమేజ్ కోల్పోయిన బాధలో మరింత త్రాగుడుకు బానిసై పోతాడు.అతన్ని ఎలాగైనా మామూలు మనిషిని చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దూరంగా తీసుకెళ్లి పోయి జీవించాలనుకుంటుంది.అతని కోసం తన సింగింగ్ జీవితాన్ని ముగించాలనుకుంటుంది.ఈ విషయాన్ని గుర్తించిన అతను తనుంటే ఆమె మరింత స్తితికి చేరుకోలేదని,తనను వదులుకోలేదని తెలిసి అతను ఆమెకు దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడు.ప్రాణ త్యాగం చేసేసుకుంటాడు.నా రూముకు వచ్చిన తరువాత కూడా పదే,పదే అదే సినిమా గుర్తుకోస్తోంది.సచిన్ జె జోషి హీరోగా,నజియా హుస్సేన్ హీరోయిన్ గా చాలా అద్భుతంగా నటించారు.

16, ఆగస్టు 2014, శనివారం

ఇకనుండీ నా బ్లాగులో...

నా కలం పేరుమీద (నామనోడైరీ:బ్లాగ్ టైటిల్)బ్లాగు మొదలిపెట్టినప్పుడు నుండీ దానికోసం రాయడం కంటే బ్లాగును డిజైన్ చేయడంలోనే ఎక్కువ సమయం కేటాయించేస్తున్నాను.ఈ రోజున పెట్టిన టెంప్లేట్ రేపు నచ్చడం లేదు.ఇలా ఎన్నో మార్చి,మార్చి చూసి చివరికి చిరాకేసిందంటే నమ్మండి.
 ఇక ఈరోజుతో ఆపనికి స్వస్తి చెప్పేసాను.(కొన్నాళ్లు సుమా!మంచి డిజైన్ నా కళ్ల బడితే అంతే నాది కూడా అటువంటి టెంప్లేట్ సెట్ చేసేయాలి.లేకపోతే నిద్రపట్టదు.)
 అయినా!నామతిగానీ..బ్లాగ్ ఎంత అందంగా ఉంటే ఉపయోగమేముందీ అందులో సరుకు బాగుండాలి గాని!అంతే గదండీ !
 ఫాతిమా మేరాజ్ గారి బ్లాగు చూడండి ఏమాత్రం అలంకరణ ఉండదు.గానీ బ్లాగులో కవిత ఫోస్ట్ అయితే చాలు హాట్ కేకుల్లా తినేస్తారు.సారీ..చదివేస్తారు.టాలెంట్ ఉండాలంతే!ఏమంటారు?
 పద్మప్రియ గారి బ్లాగు "ప్రేరణ"కూడా కొంతవరకు అలంకరణ వున్నా మంచి,మంచి కవితలలో దదరిల్లే బ్లాగే.ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాగవతం ఈ జన్మకు పూర్తికాదు.గూగుల్ వాడి మెమరి కూడా సరిపోదు.ఇంకా తెలుసుకోవాలని గట్టి  పట్టుదలగా ఉంటే...అదే బ్లాగుల గురించి "బ్లాగ్ వేదిక"ను ఓ లుక్కేయండి.
 ఇంతకీ ఓ శుభవార్త చెప్పటం మరిచాను."వెన్నెలకెరటం"అని ఈ మధ్య కొత్త బ్లాగ్ ఒకటి అవతరించింది.సాహిత్యంపై ఎక్కువుగా పని చేస్తుంది.
 ఏది,ఏమైనా నా బ్లాగులో మంచి,మంచి పోస్ట్సు చేయాల్సిందే!ఇక నుండీ ఆపని మొదలు పెడతాను.

10, ఆగస్టు 2014, ఆదివారం

మనిషికి ఆనందం డబ్బులోనే ఉందా?

మనిషికి కావల్సిన ఆనందాలు,సంతోషాలు కేవలం పూర్తి డబ్బులోనే లేవు.వీటిని పొందటానికి మాత్రం డబ్బు కూడా ఒకటి.ఈ మాట మీకు అర్ధం కాకపోవచ్చు.వింతగా అనిపించవచ్చు.కాని నిజం.
      మనిషి సంతోషంగా జీవించడానికి కావల్సిన వాటిలో డబ్బు  ప్రధానమైనది తప్ప..డబ్బే అన్నీ కాదు.డబ్బు ఏ కష్టo లేకుండా బ్రతకడానికి కావాలిగాని, కేవలం డబ్బు కోసమే బ్రతకడం ప్రారంభిస్తే అన్నీ కష్టాలే!అశాంతిమయాలే!!
      అతి అన్ని విషయాలలో ప్రమాదమే!అలాగే డబ్బు విషయంలో కూడా!
      అయితే మనిషి ఆ డబ్బు సంపాదన విషయంలో ముందుండాల్సిందే!
      హ్యాపీగా బ్రతకడానికి అతని దగ్గర డబ్బు లేకపోతే అతనికి ఏవిధమైన గుర్తింపు లేదు.సమాజంలో గౌరవం లేదు.
 ఆర్ధికబలం ఉన్నవాడికే సమాజం అండగా నిలుస్తుంది.తప్ప మంచి చెడులను బట్టి అస్సలు కాదు.
      ఎన్ని కుంభకోణాలు చేసిన నాయకుడైనా..ప్రజల మధ్య ఊరేగడం ప్రారంభిస్తే చేతులెత్తి నమష్కరిస్తుంది సమాజం.మనుష్యులను ఆ విధంగా తయారుచేస్తుంది డబ్బు.కాని వాళ్ల వ్యక్తిగత జీవితాలలో మాత్రం అలజడులు,అశాంతులు తప్ప మనశ్శాంతి మాత్రం ఉండదు.
     సరిపడే డబ్బే సంతృప్తి...అంతకు మించితే అనర్ధమే!
     నేనొకసారి కడపలో ఓ ఆధ్యత్మిక సభలోకి అతిధిగా వెళ్లినప్పుడు నా సందేశం ముగిసిన తరువాత ఓ ముస్లిం పండితుడు చక్కని కధ చెప్పాడు.
     ఆ ఊరి జమిందారు రాత్రి నిద్రపట్టక అతని ఇంటిపైన పచార్లు చేస్తున్నాడట.అయితే ఆ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు క్రింద ఓ భిక్షగాడు దోమలు ఎంత కుడుతున్నా పట్టించుకోకుండా ఆదమర్చి నిద్రపోతున్నాడు.ఈ దృశ్యం జమిందారిగారి కంటబడింది.మనస్సులోనే అనుకున్నాడు"ఎంత విచిత్రం..నాకు గదిలో పడుకోవడానికి పరుపు,దుప్పట్లు,గదినిండా చల్లటి ఎ.సి ఉన్నా నాకు నిద్రలేదు.ఈ భిక్షగాడు చూస్తే అంత చలిలో అన్ని దోమకాట్లు మధ్య నిద్రపోతున్నాడు.
    జమిందారికి "నా బ్రతుక్కంటే నీ బ్రతుకే బాగుంది అనుకుని ఆ భిక్షగాడిని మనస్సులోనే అభినందించాడు.
 మర్నాడు ఉదయమే భిక్షగాడిని కల్సి ఓ వందరూపాయలు ఇచ్చి వచ్చాడు.
    ఆరోజు రాత్రి యధావిధిగా జమిందారుగారు తన డాబాపై తిరుగుతూ చెట్టు క్రింది భిక్షగాడు నిద్రపోకుండా దోమలను తోలుతూ కూర్చోవడం చూసాడు.జమిందారుగారు ఆశ్చర్యపోతూ డాబాపైనుండి క్రిందికి వచ్చి భిక్షగాడిని అడిగాడట ఎందుకు నిద్రపోలేదని?
    దానికి భిక్షగాడు "అయ్యా! ఉదయం మీరిచ్చిన 100రూపాయలలో 90రూపాయలు ఖర్చయింది.ఇంకా నాదగ్గర 10రూపాయలున్నాయి.వాటిని ఎవడు కొట్టేస్తాడోనని నిద్రపట్టడం లేదు బాబయ్యా అన్నాడట!
    ఏది ఏమైనా డబ్బు ప్రోగు వేతే మనిషి లక్ష్యం అయితే అతనికి మనసిక శాంతి కరువే!!

2, ఆగస్టు 2014, శనివారం

నీ సంతోషం నీలోనే వుంది.

సంతోషం ఒక వృత్తం లాటిది.నీ హృదయంలోంఛి చిన్న మొక్క లాగా అంకురించిన కోరికని తీర్చుకోవడం కోసం, నీ చేతులు చేస్తున్న పనిని చూస్తున్నప్పుడు నీ కళ్లు... ఆనందంతో వర్షిస్తాయి.హృదయమూ, చేతులూ, కళ్లు ఆ మూడింటి మధ్యా పూర్తయ్యే వృత్తమే సంతోషమంటే.

     తాను చేస్తున్న పనిలో సుఖాన్ని గుర్తించినవాడు, పని చేస్తున్నానన్న విషయం మర్చిపోతాడు.అందుకే అతడు అలసిపోడు.చేస్తున్న పనిలో సంతోషం లేని వాడు తొందరగా వృద్ధుడవుతాడు.ఒక వ్యక్తి నిద్రలోనూ, పనిలోనూ,కలలోనూ ఒకే విధమైన సంతోషంగా ఉండాలి.

     బద్ధకం ఆకర్షణీయమైనదే.కాని పని తృప్తికరమైనది.విశ్రాంతిలో వృధాగా వుండే అనవసరమైన ఆనందం ఒకసారి నీకు అలవాటయితే, చేసే పనిని సగంలో ఆపు చెయ్యడం నీ వ్యసనమవుతుంది. నీ "కర్మ"నీవు చేసే పనులపై ఆధారపడివుంటుంది.నీ నుదుటి వ్రాత మీద కాదు"అన్నాడు అరిస్టోటిల్.సంతోషం కూడా అంతే.అది నీలో వుంది.నీవు త్రాగే మధువులో కాదు.అదే విధంగా సంసారంలో సంతోషం అనేది నీకు మంచి భాగస్వామి దొరకటం వలన రాదు.నీవు మంచి భాగస్వామి అవటం వలన వస్తుంది.

     గెలుపుకీ,విజయానికీ తేడా తెలుసుకో. "గెలుపు"నీలోంచి వచ్చేది."విజయం" ఇతరులు దాన్ని గుర్తించగా వచ్చేది.పని చేయలేనివాడు తనెలా చెయ్యాలనుకున్నాడో నీకు సలహా ఇస్తాడే తప్ప తాను చెయ్యడు.చెయ్యలేడు.చేసేటట్టయితే నీకెందుకు చెప్తాడు?

  •      ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు.
  •      ఇతరులు నిద్రిస్తున్నప్పుడు నువ్వు ప్రణాళిక వెయ్యి.
  •      ఇతరులు తటపటాయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో.
  •      ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు విను.
  •      ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు పని చెయ్యి.  
      పై విషయాలు నా అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాధ్ గారి "తప్పు చేద్దాం రండి" పుస్తంకంలోనివి.ఆ పుస్తకం గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.